అసలు ఈ రోజు ఏం జరిగిందంటే…
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ చిత్రంలో ‘జయ శంభో’ అనే పాట ఉన్నది. పవన్ కళ్యాణ్ చిత్రాలలోని మరెన్నో పరిచయబాణీలకు మల్లె ఈ పాట కూడా వినసొంపుగా, కూనీ రాగాలు తీయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ పాటను వింటూ వస్తున్నాను.
ఎల్లప్పుడూ అనువాద చిత్రాలలో అర్థం లేని ప్రాసా వాక్యాలు వ్రాసే భువనచంద్ర గారు ఈ పాటను కూడా వ్రాసారంట. చాలా మంచి ప్రాసతో కొద్దో గొప్పో స్ఫూర్తినిచ్చే పదాలతో, పాదాలతో గూర్చి చక్కగానే పేర్చారు ఈ పాటని భువనచంద్ర గారు. అయితే నాకు ఉన్న సూక్ష్మ దృష్టి వలనో లేక భావ కవిత్వం పట్ల ఉన్న అభిమానం వలనో ఈ విపరీత వాక్యం నా చెవినపడింది.
“వచ్చా మదనపురి, ఎన్నెన్నో దార్లు మారి, ఎవరెస్ట్ లాంటి సక్సెస్ నే ఏరీ కోరీ”
మంచి వాక్యమే కదా… నిజంగానే ‘బంగారం’ పాత్ర క్యాసెట్ను జారవిడిచి, ఉద్యోగం పోగొట్టుకుని, పెద్దాయనను బుట్టలో వేద్దామని వెళ్లి, అటు నుంచి పరిస్థితుల బారీన పడి తప్పక ఎన్నెన్నో దార్లుమారి వెళ్తాడు కదా… ఒక చిన్ని ఛానెల్ కోసం పని చేసే పాత్రికేయుడు BBC వంటి గొప్పపత్రికలో పాత్రికేయ కథనాలను ప్రచురించాలి అనే గొప్ప కలని కంటూ, ఎవరెస్ట్ అంతటి కోరిక కోరుకుంటున్నాడు కదా… అన్ని పాదాలను అంతలా కథానుకూలంగా కూర్చిన భు.చ. గారు ‘మదనపురి’ అని రాసారు అంటే కచ్చితంగా ఈ కథానువృత్తం నాటి మదనపురి అయిన నేటి ‘మదనపల్లె’ లో జరిగి ఉంటుంది కదా ఆనే అనుమానం కలిగింది.
ఇట్టి సంకోచములో మునిగిన నేను చివరకు చిత్రం చూసి నివృత్తి చేసుకొనుటకు నిశ్చయించినాను. విచిత్రము ఏమనగా నిజానికి బంగారం వెళ్లే గ్రామము పేరు ‘పత్తికొండ’. ఈ గ్రామము కర్నూల్ జిల్లాలో ఉన్నది. మదనపల్లె నుండి ఆరుగంటల ప్రయాణము. ప్రాస కోసమే రాసినట్టు అయితే కాస్త కష్టపడి దగ్గర్లో ఉన్న ‘గుత్తి’ నో లేక ప్రాముఖ్యత కలిగిన ‘మద్దికేరి’ నో ఇరికించి ఉండొచ్చు. కానీ, అవేమి జరగలేదు. పోగా రెండు అనుమానాలు మిగిలాయి. అసలు కవి గారికి కర్నూల్ జిల్లా లోని “పత్తికొండ”కు, చిత్తూరు జిల్లా లోని “మదనపల్లె”కు వ్యత్యాసం తెలుసునా లేదా అని, లేక పాట వ్రాసిన తరువాత చిత్రీకరణ సమయములో మార్పుల వలన జరిగిన తప్పిదమా అని… ఏది ఏమైనప్పటికీ ఓ సగటు శ్రోతగా, చిత్ర వీక్షకుడిగా నన్ను మభ్యపెట్టిన సంగతి నాకు మింగుడుపడడం లేదు.
ఇలాంటప్పుడే గురూజీ సిరివెన్నెల గారిని పొగిడిన ప్రసంగంలో చెప్పిన ఓ మాట గుర్తొస్తూ ఉంటుంది. ‘తెలుగు చలనచిత్ర సాహిత్యపు విలువను పెంచిన మహానుభావులు మీరు’ అని. నిజమేనేమో. ఇదే రకమైన పదప్రయోగాలు సరైన సమయసందర్భాల్లో అలవోకగా చేసే సీతారామశాస్త్రి గారి విలువ తెలియాలన్నా, వారు సగటు ప్రేక్షకుడికి ఇచ్చే గౌరవాన్ని అర్థం చేసుకోవాలన్న అరటిపండు తొక్కతీసి నోట్లో పెట్టేటటువంటి గురూజీ కూడా కావాల్సిందేనేమో. ఏమో మరి.