తీయడానికి ఏ కథ లేకపోతే, రాయడానికి ఏమీ రాకపోతే, ఆ రాకపోవడం గురించి అయినా రాయొచ్చు కదా అని ఒక గొప్ప కళాకారుడు నా చిన్నప్పుడు చెప్పాడు. నా పరిస్థితి కూడా అదే ఏమో మరి.
ఏమని రాయను చెప్పండి. ప్రకృతి అందాన్ని చూసి మురిసిపోయే ప్రతీ సారీ, దాని వర్ణన చేస్తూ, జ్ఞాపకాలుగా తీసుకున్న ఫోటోలను ఇంటర్నెట్ లో షేర్ చేయడం వలన ఆ ప్రకృతి పాడైపోవడం గురించి రాయమంటారా? ఎప్పుడో ఒకప్పుడు మన మనసుకి నచ్చి చేయాల్సిన కాలక్షేపాలను పిల్లల మీద రుద్దుతూ అవి కలిగించగలిగే ఆనందాలు కనుమరుగై పోవడం గురించి రాయనా?
పిల్లలకు చదువు, సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత కలిగి ఉండే ఈ సమాజం తమ చదువును, సంస్కారాలను మరిచి రకరకాల వ్యసనాలకు బానిసలుగా గురించి రాయనా? లేక భావి తరాన్ని సాకే తీరిక, ఓపిక లేని నేటి నెటిజన్ తరం వారి బరువు బాధ్యతలను వేరొకరి పైకి నెట్టివేయడానికి చేసే నాటకం వివరించనా?
రాజ్యార్హత, రాచగౌరవము కనకపు సింహాసనమున కూర్చోపెట్టిన శునకాల చేతిలో కారం అంటిన కీలు బొమ్మలు అవుతుంటే ఉద్వేగభావాలను భద్రపరచనా? ఎందరు మంచి కోరి మాట్లాడినా, అహంకారము చేత కళ్లు మూసుకుపోయిన వారి వాదోపవాదాలు కలిగించే మనోవేదనను వ్యక్తపరచనా?